తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మానుకోటలోని పేదలకు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందితో కలిసి భోజనం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో, ఈ ప్రభుత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్నిసాధించిన పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు అయిన సందర్భంగా సంబరాలు చేసుకోవాలసి ఉంది. ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చేస్తున్నందున, ఈ మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేందుకు ఎవరి ఇంటి వద్ద వారు జెండా ఎగురేసి ఆవిర్భావ దినోత్సవాలు జరపాలని పార్టీ అధినేత పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండా ఎగురేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ లాక్ డౌన్ సందర్భంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండొద్దన్న సిఎం కేసిఆర్ పిలుపుననుసరించి మానుకోటలోని పేదలు, వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది దాదాపు 500 మందికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భోజన ఏర్పాట్లు చేసి, వారికి స్వయంగా వడ్డించారు.అనంతరం వారికి మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేసి, కరోనా కట్టడిలో అందరూ సహకరించాలని కోరారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి కేసిఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన తెలంగాణను, దేశంలో అందరూ ప్రశంసించేలా అభివృద్ధి చేస్తున్నారని, అన్ని వర్గాల వారు సంతోషంగా, సుభిక్షంగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, అలాంటి ప్రభుత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోతు బిందు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.